Monday 6 August 2012

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్

(6 August 1934 – 21 June 2011)     
         
    తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి (ఆగస్టు 6)  సందర్భంగా ఉద్యమ శక్తులు విజృంభించడం యాధృచ్ఛికమే కావచ్చు. కానీ జయశంకర్ మన మధ్య భౌతికంగా లేనప్పటికీ తెలంగాణ ఉద్యమానికి ఇప్పటికీ ఆయన చూపిన బాటనే అనుసరణీయంగా ఉన్నది. ఉద్యమశక్తులకు ఆయన స్ఫూర్తిదాయకం. నిజానికి తెలంగాణ సమాజం నిరంతరం ఉద్యమంలోనే ఉన్నది. పల్లెపల్లెన  వివిధ రూపాలలో ఉద్యమం సాగుతూనే ఉన్నదంటే అందుకు జయశంకర్ వేసిన పునాది, చూపిన పంథా, కలిగించిన అవగాహన కారణాలు. ప్రజల్లో రగులుతున్న ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్రంపైన, రాష్ట్ర పాలకవర్గంపైన ఒత్తిడి పెంచవలసిన బాధ్యత ఉద్యమ నాయకత్వంపై ఉన్నది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను, ఆంధ్రపాలకుల కుట్రలను తిప్పికొట్టాలె. 
           ఉద్యోగ సంఘాల ప్రముఖ నాయకుడు స్వామిగౌడ్ ఉద్యోగ విరమణ సందర్భంగా హైదరాబాద్‌లో ఆగస్టు 4న (2012) జరిగిన అభినందనసభ ఉద్యమ నేపథ్యంలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. ఈ వేదికపై నుంచే టి.ఆర్‌ఎస్. అధినేత కేసీఆర్ ఉద్యమ శంఖం పూరించారు. తెలంగాణ ఇవ్వనున్నట్టు కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన సంగతిని ధృవపరుస్తూ, ఒకవేళ ఈ ప్రకటన వెలువడకపోతే, ఈనెల ఇరవయవ తేదీ తరువాత ఉద్యమానికి వ్యూహ రచన చేయనున్నట్టు ప్రకటించారు. ఆంధ్ర లాబీ ఒత్తిడిని అధిగమించి కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందా అనే అనుమానాలు టిఆర్‌ఎస్‌తో సహా అన్ని వర్గాలను వేధిస్తున్నది. కేసీఆర్ ప్రసంగంతో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్యమానికి ఊపువచ్చిందనవచ్చు. తెలంగాణ జేఏసీ కూడా ఇప్పటికే ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటున్నట్టు ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో గతంలో ఏర్పడిన జేఏసీలను గుర్తించి, అనుసంధానం చేయాలని ప్రయత్నిస్తున్నది. వచ్చే నెల చివరన హైదరాబాద్ మార్చ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు కూడా ఉద్యమం పట్ల ఆసక్తి చూపడం హర్షణీయమే అయినప్పటికీ వీరు కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ నాయకత్వంపై చేసే పోరుకు ఏమేర విశ్వసనీయత ఉంటుందనే ప్రశ్న తలెత్తుతున్నది. 
           గత పన్నెండేళ్ళను గమనిస్తే తెలంగాణ ఉద్యమం అంతకంతకూ ఉధృతమవుతున్నదని స్పష్టమవుతున్నది. గతంలో సకల జనుల సమ్మె దేశమంతటా కాకపుట్టించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు కూడా స్తంభించి పోయాయి. ఈ సారి ఉద్యమం మరింత ఉధృతంగా, సుదీర్ఘంగా ఉండవచ్చు. మరింత బహుముఖంగా సాగవచ్చు. అయితే ఉద్యమ కారుల ఆత్మవిశ్వాసం దెబ్బతీయడానికి, ఉద్యమాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఆంధ్ర పాలకులు, వారి పత్రికలు, టీవీలు అనేక కుట్రలకు పాల్పడతాయి. వీటిని నిబ్బరంగా ఎదుర్కొని ఉద్యమించాలె. పోరాడి, పోరాడి అలసి పోయిన తరువాత అదను చూసుకుని భయానక అణచివేతను ప్రయోగించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనేది ఆంధ్ర పాలకవర్గం ఎత్తుగడ. ఉద్యమాన్ని అణచివేసిన తరువాత ఏదో ఒక ప్యాకేజీ ప్రకటించి ఇదే ఉద్యమం సాధించిన విజయంగా ప్రచారం చేసి పెడతారు. శ్రీకృష్ణ కమిటీ ద్వారా ఆంధ్ర పాలకవర్గం కేంద్రానికి చెప్పించిన పన్నాగం సారాంశం ఇదే. 
            అందువల్ల ఉద్యమాన్ని ఒకేసారి ఉధృతంగా మారి కుప్పకూలకుండా ఉద్యమ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించాలె. ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చాలని కూడా ఆంధ్రనాయకులు కుట్రలు పన్నుతుంటారు. అదే పనిగా ఉద్యమకారులను రెచ్చగొడుతుంటారు. ఉద్యమాల పట్ల సగటు మధ్యతరగతి ప్రజలు అసహ్యం పెంచుకునే విధంగా దొంగదెబ్బలు కొడుతుంటారు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు కొందరు ముసుగు వ్యక్తులు సమీప ప్రాంతాల వాహనాలు ధ్వంసం చేయడం ఇందుకు ఉదాహరణ. పాత్రికేయుల వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు, రైలు రోకోలు సాగినప్పుడు అధికారపార్టీ నాయకులపై కూడా లాఠీలు ప్రయోగించి, కేసులు పెట్టి రెచ్చగొట్టిన ఉదంతాలు ఉన్నాయి. ఉద్యమకారులు నిబ్బరంగా వ్యవహరిస్తూ ఆంధ్ర పాలకుల కుట్రలను బయట పెట్టాలె. ఉద్యమం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నది ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం. అందువల్ల ఈ వర్గం ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా తదుపరి ఉద్యమం రూపుదిద్దుకోవచ్చు. 
           జయశంకర్ సార్ బతికుండగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చూడలేక పోవడం బాధాకరం.అయితే ఆయనకు తెలంగాణ ప్రజల ఉద్యమచైతన్యంపై ఆయనకు అపారమైన నమ్మకం.గతంలో టీడీపీ అధినేత ఎన్టీఆర్ మూడు ప్రాంతాలు నావే అని ప్రకటించి, మూడు చోట్లా పోటీ చేసినప్పుడు, తెలంగాణలో ఆయన ఓడిపోవడం వంటి అనేక ఉదంతాలను సూక్ష్మంగా పరిశీలించి సిద్ధాంతీకరించిన ఘనత జయశంకర్‌ది. ఆంధ్రపాలకుల విధ్వంసకర పాలన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తుందని ముందుగా ఊహించి, తదనుగుణంగా వ్యూహ రచనకు పూనుకున్నారు. తెలంగాణ ఉద్యమం విద్యావంతులకు పరిమితమై ఉన్న కాలంలోనే, తెలంగాణ ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉన్నదని, పోరాడుతారని, సాధించుకుంటారని ఆయన బలంగా నమ్మారు. ఆ విశ్వాసమే ఆయనను ముందుకు నడిపించింది.ఆయన బాటలో కోట్లాది ప్రజలు వచ్చి చేరారు.
           ఉద్యమం తన కండ్ల ముందే బలోపేతమైంది. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన నడిచిన బాటలో నడుద్దామని, తెలంగాణ సాధించుకుందామని దృఢ నిశ్చయానికి వద్దాం. జయశంకర్ ఉన్నప్పుడు ఆయన ఏ ఒక్కరి వాడిగా వ్యవహరించలేదు. ఉద్యమం కోసం ఎవరు ముందుకు వచ్చినా మద్దతు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమం మనదని భావించేవిధంగా ఆయన వ్యవహరించేవారు. తెలంగాణ శక్తులు ఏకతాటిపై నడవాలనేది ఆయన ఆకాంక్ష. ఒకే వేదికపై లేకున్నా, పరస్పర ప్రతిబంధకంగా మారకుండా సహకరించుకోవాలని ఆయన ఉపదేశించారు. తెలంగాణ ఉద్యమశక్తులు ఈ సూచనలోని అంతర్యాన్ని గ్రహించి సమైక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవాలె.

No comments:

Post a Comment